ఓ హీరో ఏడాదికి ఐదు, అంతకంటే ఎక్కువ సినిమాలు చేయాలి.. అప్పుడే, సినీ పరిశ్రమ బాగుపడుతుంది.!
ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం రెవెన్యూ, తెలుగు సినిమాకి వెళుతోంది. ఆ లెక్క, ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగులు చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలి. అలా చేస్తే, అది పరిశ్రమకే మంచిది.
ఏదో ఒక పండక్కి పెద్ద సినిమాలు రావడం కాదు, ఏడాదంతా సినిమా థియేటర్లు కళకళ్ళాడాలి.. అప్పుడే, సినీ పరిశ్రమకి మంచి రోజులొస్తాయ్.!
హీరోలు, కొందరు దర్శకులు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే మంచి సినిమాలు రావడానికి ఆస్కారమేర్పడుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్.. ఇవన్నీ తెలుగు సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోన్న ఉచిత సలహా. నిజానికి, పై సలహాలేవీ తప్పుపట్టదగ్గవి కావు. కానీ, ‘అవి మా సలహాలు’ అని చెప్పడానికి మంత్రి పేర్ని నానికి ధైర్యం సరిపోలేదు. ‘నా వద్దకు వచ్చిన ఎగ్జిబిటర్లు, కొందరు సినీ పరిశ్రమకు చెందినవారు చెప్పిన మాటలివి.’ అనేశారు పేర్ని నాని.
ఓ హీరో ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలన్నది ఆ హీరో ఇష్టం. కథలు దొరక్కపోతే, ఏ హీరో అయినా ఎన్ని సినిమాలు చేయగలడు.? ఒకప్పటి సినిమా పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. కమర్షియల్ లెక్కలేసుకోకుండా కాంబినేషన్లు సెట్ కావడంలేదు. సినిమాలు ఎక్కువ రోజులపాటు థియేటర్లలో ఆడే పరిస్థితీ లేదు.
సినిమా థియేటర్లపై ఉక్కుపాదం మోపడాన్ని ప్రభుత్వం ఆపేస్తే, అది సినీ పరిశ్రమని ఉద్ధరించినట్లేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. మారిన ట్రెండ్ నేపథ్యంలో సినిమా థియేటర్లు మనుగడ సాధించే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ తీరు కారణంగా.. ఆ మనుగడ సాధించడం అనేది మరింత ప్రశ్నార్ధకమవుతోంది.
సినిమాలు ఎలా తీయాలో.. ఎంత బడ్జెట్టులో తీస్తే సక్సెస్ అవుతాయో.. హీరోలు ఎలా వుండాలో.. దర్శకులు ఏం చేయాలో.. నిర్మాతలు ఎలా పెట్టుబడులు పెట్టాలో ప్రభుత్వ పెద్దలు చెబితే, ఇక సినిమా ఎలా తన ఉనికిని చాటుకోగలుగుతుంది.? ఛాన్సే లేదు.
Recent Random Post: