హోంమంత్రిగా అచ్చెన్న: బెర్త్ కన్ఫర్మేషన్ అయిపోయిందోచ్.!

‘మేమే అధికారంలోకి రాబోతున్నాం. మా పార్టీ అధినేత చంద్రబాబుని అడిగి మరీ హోంమంత్రి పదవి తీసుకుంటాను. అప్పుడు చెప్తాను మీ సంగతి. మీ పోలీసులందరినీ తప్పుపట్టలేను. కానీ, కొందరు అధికారులు మాత్రం వైసీపీ కార్యకర్తల కంటే కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకు నోటీసులు ఇస్తే, నేను విచారణకు వస్తాను. కానీ, మీరు అలా చేయడంలేదు. నేరుగా బెడ్రూమ్‌లోకి వచ్చేస్తున్నారు..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు పోలీసుల మీద.

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అచ్చెన్న సొంతూరు నిమ్మాడలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఆయన మీద కేసు నమోదయ్యింది.. ఈ క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కర్రలు, ఇనుప రాడ్డులు పట్టుకుని విధ్వంస కాండ సృష్టించేందుకు వచ్చిన వైసీపీ నేత మీద కేసులు పెట్టి, అరెస్టు చేయకుండా ఏ తప్పూ చేయని తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసుల మీద తెగ గుస్స అయిపోయారు అచ్చెన్నాయుడు.

అయినా, అచ్చెన్నాయుడికి తెలియనిదేముంది.? చంద్రబాబు హయాంలో అచ్చెన్న ఎలా రెచ్చిపోయారో.. ఆయన సొంత నియోజకవర్గంలో ఏ గడపనడిగినా చెబుతారన్నది వైసీపీ వాదన. సరే, అప్పుడు చంద్రబాబు హయాంలో తప్పులు జరిగాయి గనుక, అంతకన్నా తప్పులు తాము చేస్తున్నామని వైసీపీ చెప్పదలచుకుంటే అది వేరే చర్చ.

మిగతా విషయాల్ని పక్కన పెడితే, ‘నేనే హోంమంత్రిని..’ అంటూ అచ్చెన్న వీరావేశంతో చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది. అచ్చెన్నకు చంద్రబాబు అంత సీన్ ఇస్తారా.? అసలు మళ్ళీ అధికారంలోకి వచ్చేంత సీన్ చంద్రబాబుకి వుంటుందా.? అప్పటిదాకా అచ్చెన్న టీడీపీలోనే వుంటారా.? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి వుంది.

అచ్చెన్నకు గనుక ఆయన కోరుకుంటున్నట్లే హోంమంత్రి పదవి దక్కితే.. ఇక, ఆ తర్వాత చోటు చేసుకునే అరాచకం.. ఏ స్థాయిలో వుంటుందోనంటూ వైసీపీ శ్రేణులు చిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారు.. అక్కడికేదో వైసీపీ హయాంలో అద్భుతమైన పాలన జరుగుతున్నట్టు.

Share


Recent Random Post: