మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నారాయణ అరెస్టుకు కారణం చెప్పకుండా.. కనీసం నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నామని అన్నారు. జగన్ తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు.
పది పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై మోపుతున్నారని ఆరోపించారు. ఓవైపు మంత్రి బొత్స పరీక్షల పేపర్లు లీక్ కాలేదని చెప్తుంటే.. ఇదే నెపంతో ఆయన్ను ఎలా అరెస్టు చేస్తారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ మూడేళ్ల పాలనలో విపక్షాలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అభివృద్ధి చేయమని ప్రజలు జగన్ కు అధికారం అప్పగిస్తే.. విపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
Recent Random Post: