చావు కబురు చల్లగా చెప్పడమంటే ఇదే మరి. ఓ నాటు మందుని ఆయుర్వేద మెడిసిన్.. అనే కోణంలో ఎలా ప్రచారం చేయగలిగారు.? ప్రపంచానికి పెను సవాల్ విసిరిన కరోనా వైరస్ అనే మహమ్మారిని.. జస్ట్ మూలికా వైద్యంతో నయం చేసెయ్యగలమని ఎలా చెప్పుకోగలిగారు.? అధికార పార్టీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో ఈ తతంగానికి ఇంత ప్రాచుర్యం ఎలా లభించింది.? ఆయుష్ విభాగం, ఐసీఎంఆర్.. ఇలా నానా హంగామా నడిచాక, చివరికి ‘నాటు మందు’ అని తేల్చడాన్ని ఏమనుకోవాలి.?
‘పెద్ద మొత్తంలో మందు తయారు చేయాలంటే.. అది వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది..’ అని వైసీపీ అనుకూల మీడియా కథనాల్ని వండేసిందంటే.. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రి నుంచి కరోనా రోగులు, అంబులెన్సుల్లో, సొంత వాహనాల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వెళ్ళిపోయారు నాటు వైద్యం కోసం. చివరికి ఏమయ్యింది.? నాటు వైద్యం తీసుకున్న ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
కంట్లో మందు వేయడంతో, కంటికి ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. మరీ ఇంత దారుణమా.? ఇదే పని ఇంకెవరైనా చేసి వుంటే, పరిణామాలు ఇంకెలా వుండేవో. వేలాది మంది, వైద్యం కోసం నాటుమందుని ఆశ్రయించిన దరిమిలా, ఈ కారణంగా ఎంతమందికి అదనంగా కరోనా సోకిందో ఏమో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిస్థితిని సమీక్షించి, ముందు జాగ్రత్త చర్యగా మందు పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించడంతో పెను ప్రమాదమే తప్పిందని అనుకోవాలేమో.
కానీ, అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందన్న విమర్శలున్నాయి. ‘అబ్బే, అందులో చెడు చేసే అంశాలేవీ లేవు.. నాటు మందుగా స్వీకరించొచ్చు..’ అని కొందరు అధికారులు చెబుతుండడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ప్రాణాలతో ముడిపడి వున్న అంశమిది. నాటు మందు అని తేల్చారు గనుక, ఆ నాటు మందు వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా.? ఇక్కడితో అయినా, ఈ నాటు మందుపై అనవసర ప్రచారం ఆగేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.
Recent Random Post: