అవంతి అమాయకత్వం: రాజీనామా చేస్తే చట్ట సభల్లో మాట్లాడేదెవరు.?

‘ఎమ్మెల్యే పదవులకీ, ఎంపీ పదవులకీ రాజీనామాలు చేసేస్తే, చట్ట సభల్లో ఎవరు మాట్లాడతారు.? ఎమ్మెల్యేలుగా వుంటనే మాట్లాడగలం.. ఎంపీలుగా వుంటేనే నిలదీయగలం..’ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చాలా అమాయకంగా ప్రశ్నించేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిథులు రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి రావడానికి సంబంధించి స్పందిస్తూ. నిజమే, ప్రశ్నించడానికి ఓ బలమైన వేదిక కావాలి. అది చట్ట సభ అయితే బావుంటుంది. కానీ, చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు ప్రజా సమస్యలను ధైర్యంగా ప్రస్తావించగలుగుతున్నారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

గత కొంతకాలంగా చట్ట సభలు నడుస్తున్న తీరు చూస్తోంటే, అధికారంలో వున్నవారు తమకు ‘మంచి’ అనిపించుకుంటున్న అంశాలపై చట్టాలు చేసి పడేస్తున్నారు తప్ప, ప్రజాభిప్రాయంతో సంబంధమే వుండటంలేదు. పరిపాలన అనేది ప్రజల కోసం. ప్రజామోదంతో జరిగే పాలన, ప్రజారంజకంగా వుంటుంది. ప్రస్తుత ప్రజాస్వామ్యంలో అలాంటివి ఆశించలేం. ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు చేస్తున్నారు, అంతకు మించి సంపాదించడం కోసం.. ప్రజా ప్రతినిథులయ్యాక కష్టపడుతున్నారు. ఇందులో ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్యం.. వంటి అంశాలపై చర్చకు సమయమేదీ.? ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలు తమ పదవులకు గతంలో రాజీనామా చేశారు. రాజీనామా చేసినా, ఉప ఎన్నికలు వచ్చే సమయం లేదని ఖరారు చేసుకున్నాకనే.. అప్పట్లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారన్నది నిర్వివాదాంశం.

ప్రజా ప్రతినిథులకు ఇన్ని తెలివితేటలు తగలడ్డాక.. వారేదో, చట్ట సభల్లో ఊడబొడిసేస్తారని సామాన్యులు భావించగలరా.? ఛాన్సే లేదు. సరే, పార్లమెంటులో ఎంపీలు గట్టిగా గళం విన్పించాల్సిందే. కానీ, ఎలా.? ప్రత్యేక హోదాపై నిలదీశారా.? రాష్ట్రానికి బడ్జెట్ పరంగా అన్యాయం జరిగితే నిలదీశారా.? వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తాజా బడ్జెట్ మీద పెదవి విరిచారు. కానీ, ప్రధానికి విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖలో ‘గొప్ప బడ్జెట్ ’ అని కొనియాడారు. ఇదీ వైసీపీ నిబద్ధత.. రాష్ట్రం విషయంలో. ఇక, మంత్రి అవంతి.. రాజీనామ విషయమై చేసిన వ్యాఖ్యల్లో.. ఆయన తన భయాన్ని చాటుకున్నారు తప్ప, బాధ్యతగా మాట్లాడినట్టు లేదు.


Recent Random Post: