అవంతి శ్రీనివాసరావు.. అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, పైగా మంత్రిగా కూడా వున్నారు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన విషయం విదితమే. చంద్రబాబు హయాంలో ఎంపీగా పనిచేసిన అవంతి మీద అప్పట్లో చాలా అవినీతి, భూ కబ్జా ఆరోపణలు చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే అవంతి, వైసీపీలో చేరారో.. ఆయన పునీతుడైపోయారు. ఇప్పడాయన మంత్రి హోదాలో, ఒకప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు.. భూకబ్జాలపై మండిపడుతున్నారు.
చంద్రబాబు హయాంలో భూకబ్జాలు జరిగాయనీ, టీడీపీ నేతలు దోచుకున్నారనీ అవంతి శ్రీనివాసరావు మండిపడిపోయారు. టీడీపీ నేతలంటే ఇప్పుడు టీడీపీలో వున్న నేతలు మాత్రమేనా.? గతంలో టీడీపీలో వుండి, ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో వున్న నాయకులా.? టీడీపీకి చెందిన ఒకప్పటి కీలక నేతలు చాలామంది ఇప్పుడు వైసీపీలో వున్నారు. వాళ్ళందరికీపైనా అప్పట్లో భూ కబ్జా ఆరోపణలున్నాయి. వాళ్ళను తప్పించి, ప్రస్తుతం టీడీపీలో వున్న నేతల మీదనే వైసీపీ కబ్జా ఆరోపణలు చేస్తోందన్నమాట.
ఈ కబ్జా ఆరోపణలెందుకు చెప్మా.? అంటే.. ఇంకెందుకు, టీడీపీ నుంచి వైసీపీలోకి దూకెయ్యమని ఓ హెచ్చరిక అంతే. దూకేస్తే మళ్ళీ అవంతిలా పునీతులైపోతారు. అసలు విశాఖలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా భూ కబ్జాలు జరిగినట్లు లెక్క కాదు. నిజానికి, చంద్రబాబు హయాంలోనే భూకబ్జాలపై సిట్ ఏర్పాటయ్యింది. ఆ సిట్ నివేదిక ఏం చెప్పింది.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘మేం అధికారంలోకి రాగానే, సిట్ విచారణ గుట్టు రట్టు చేస్తాం..’ అని అప్పట్లో వైసీపీ తెగ హడావిడి చేసింది. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా, ఆనాటి ఆ సిట్ రహస్యాలు ఇంకా బయటకు రాలేదు. ‘
త్వరలో సిట్ రహస్యాలు బట్టబయలు చేస్తాం..’ అని అవంతి సెలవిచ్చారు.? ఇంకెప్పుడు తెస్తారు మహాప్రభో.? అంటూ జనం మొత్తుకుంటున్నారు. ఇంకో రెండేళ్ళ తర్వాతో మూడేళ్ళ తర్వాతో ప్రభుత్వం మారొచ్చు.. రాజకీయ నాయకులూ ఇట్నుంచి అటు, అట్నుంచి ఇంటు జంపింగులు చేస్తారు.. వీరిలో కొందరు పునీతులవుతారు, కొందరు కొత్తగా పాపాత్ములవుతారు. పెద్దగా తేడాలేమీ వుండవ్.. కబ్జాలు మాత్రం నిరంతర ప్రక్రియ.. అంతే.
Recent Random Post: