జస్ట్ ఆస్కింగ్: బైబిల్ పట్టుకుంటే.. ఓట్లు అడగకూడదా.?

ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు అత్యంత పతనస్థాయికి దిగజారిపోయాయి. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కొత్త నినాదం తెరపైకొచ్చింది. ‘ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలన్నవాడికి ఓటు వేస్తారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తిరుపతి ఓటర్లను సూటిగా ప్రశ్నిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ‘బైబిల్ చేతపట్టకున్నవారికి ఓట్లేస్తారా.? భగవద్గీత పట్టుకున్నవారికి ఓట్లేస్తారా.?’ అంటూ బండి సంజయ్ తిరుపతి ఓటర్లను ప్రశ్నించడం గమనార్హం.

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల కోసం బీజేపీ చేసిన పబ్లిసిటీ స్టంట్లు కొంత మేరకు వర్కవుట్ అయ్యాయి.. బీజేపీ వ్యూహాలు ఫలించడం వల్లే టీఆర్ఎస్‌ని తెలంగాణలో బీజేపీ ఢీ కొనగలుగుతుంది. అయితే, ఆ వ్యూహమే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోసం వాడుదామనుకుంటే.. బీజేపీ అనుకున్నది సాధించగలుగుతుందా.? ఏమోగానీ, బైబిల్ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా బీజేపీకీ, అలాగే జనసేన పార్టీకీ తిరుపతి లోక్‌సభ పరిధిలోనే కాదు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందన్నది నిర్వివాదాంశం. మరీ ముఖ్యంగా బీజేపీ తీరుతో జనసేన పార్టీ దారుణంగా నష్టపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. క్రైస్తవంలోకి మారిన దళితులు, బీసీలు.. ఇంకా హిందువులగానే ఆయా సంక్షేమ పథకాలు అందుుంటున్నారు.. ఇలాంటివారి ఓట్లు వైసీపీకి కీలకంగా మారాయి 2019 ఎన్నికల్లో. ఆ మాటకొస్తే, అన్ని పార్టీల సానుభూతిపరుల్లోనూ ఇలాంటివారున్నారు. క్రైస్తవంలోకి మారినవారెంతమంది.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణరాజు కొన్నాళ్ళక్రితం ఇదే అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, వాస్తవ లెక్కల కంటే ఎన్నో రెట్ల క్రిస్టియన్లు తెలుగు రాష్ట్రాల్లో వున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి, ఈ ఓట్లు లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయగలదా.? తెలిసీ, బీజేపీ ఎందుకింత ప్రమాదకరమైన గేమ్ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆడేందుకు సిద్ధమయ్యింది.? ఇది కేవలం బీజేపీ తెలంగాణ శాఖ ఆలోచనా.? ఆంధ్రపదేశ్ బీజేపీ శాఖ.. అలాగే కేంద్ర బీజేపీ కూడా ఇదే ఆలోచనతో వుందా? ఈ అంశాలపై జనసేన కాస్త స్పష్టత తెచ్చుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే, జనసేన భవిష్యత్ లక్ష్యాలు చాలానే వున్నాయి.. వాటికి ఈ మత రాజకీయాలు అడ్డంకిగా మారతాయ్.


Recent Random Post: