ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి కాస్సేపటి క్రితం ప్రసంగించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని, దేశ ప్రజలకు ఏం సందేశమిస్తారు.? లాక్ డౌన్ మళ్ళీ వుంటుందా.? కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది.? దేశ ప్రజలకు ప్రధాని ఎలాంటి భరోసా ఇస్తారు.? ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయిన దేశ ప్రజానీకానికి కేంద్రం ఏమైనా ఊరట కలిగిస్తుందా.? లేదా.? ఇలా చాలా ప్రశ్నలు. కానీ, దేనికీ సమాధానం దొరకలేదు.
‘లాక్ డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి’ అంటూ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అంటే, లాక్ డౌన్ వద్దే వద్దని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారన్నమాట. మరి, ప్రజల్ని ఎవరు కాపాడతారు.? ఈ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద సమాధానం లేదు. ప్రజలు ఎలాగైనా పోనీ.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
ఔను, దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలయ్యాక.. భారతీయ జనతా పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మెరుపు పర్యటనలు నిర్వహించారు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో. ఈ సందర్భంగా నానా రకాల రాజకీయ విమర్శలూ తెరపైకొచ్చాయి. దేశ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, ఆయా రాజకీయ బహిరంగ సభల్ని ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేసుకుని వుంటే, దేశ ప్రజల గురించి ఆయన గట్టిగా ఆలోచించే వ్యక్తి అని దేశమంతా అనుకుని వుండేదేమో.
సరే, రాజకీయ పార్టీలన్నాక రాజకీయాలు చేస్తాయి.. అన్ని పార్టీల్లానే, ఆ మాటకొస్తే ఇంకాస్త ఎక్కువగానే బీజేపీ కూడా రాజకీయం చేసింది. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఓ రాజకీయ నాయకుడిలానే చూడాలి. అంతకు మించి, ఆయన్నుంచి ఈ విషయంలో కొత్తగా ఆశించడం సబబు కాదేమో. ఇక, లాక్ డౌన్ నుంచి దేశాన్ని రక్షించండి.. అని మాత్రమే పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ, భవిష్యత్తులో లాక్ డౌన్ అనేది దేశ ప్రజల చేతిలో వుందని, నెపాన్ని జనం మీదకు నెట్టేశారు.
కరోనా సెకెండ్ వేవ్ గురించి ముందే అంచనా వేయడం కేంద్రానికి చేతకాలేదని ఎలా అనుకోగలం.? ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ల కొరత, మందుల కొరత.. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, దేశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిండా ముంచేసిందనే విషయం సుస్పష్టమవుతోంది. ఇక, 130 కోట్ల మంది భారతీయులకి ఆ దేవుడే దిక్కు.
Recent Random Post: