ఈసీతో ఇలాంటి వివాదంపై వైఎస్ ఏం చేశారంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పరేషాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గట్టి పట్టుదలతో ఉండగా.. ఆయన పదవి నుంచి దిగిపోయే వరకు వాటిని నిర్వహించే ప్రసక్తే లేదని అధికార పార్టీ భీష్మించుక్కూర్చుంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీకి ప్రభుత్వపరంగా సహకారం అందడంలేదు. అయితే, గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏం చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2006లో వైఎస్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. రిటర్నింగ్ అధికారిగా ప్రస్తుతం సీఎం జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్ అధికారుల జాబితాను ఈసీ ఆమోదించింది. అయితే, తర్వాత ఓ అధికారిపై కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రవీణ్ ప్రకాశ్ ఆ అధికారిని తప్పించారు. ఇది తెలిసి ఈసీ ఆయన్ను మందలించింది.

ఈసీ ఆమోదం పొందిన తర్వాత అలా మార్చకూడదని.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవరణలు ప్రతిపాదించి ఆమోదించాలని సూచించింది. కానీ ప్రవీణ్ ప్రకాశ్ సరిగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఈసీ ఆయన్ను బదిలీ చేయాలని ఆదేశించింది. కానీ తనకు ఆప్తుడైన ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయడానికి వైఎస్ అంగీకరించలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీయే సుప్రీం అని.. వారితో ఘర్షణకు దిగితే మనకే నష్టం అని సీఎస్ చెప్పడంతో వైఎస్.. హుందాగా వ్యవహరించి ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేశారు.

అలాగే 2008లో వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలన్న ఈసీ సూచనను వైఎస్ సర్కారు అమలు చేసింది. కానీ ప్రస్తుతం ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.

Share


Recent Random Post: