ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ పాపాన్ని, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మోపేందుకు అధికార వైసీపీ నానా తంటాలూ పడుతోంది. స్థానిక ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం ఎంతలా మొరపెట్టుకుంటున్నా వినకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు పెట్టేశారనీ, ఆ కారణంగానే కరోనా సెకెండ్ వేవ్ వచ్చిందనీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీదనే ఈ పాపాన్ని మోపేస్తోన్న వైసీపీ, నిమ్మగడ్డ తర్వాత ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీని కూడా బాధ్యుల్ని చేయగలరా.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. పంచాయితీ, మునిసపల్ ఎన్నికల వరకూ పరిస్థితి ప్రశాంతంగానే వుంది. ఆ తర్వాతే కరోనా భయాలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ అంత సబబు కాదని భావించి, పరిషత్ ఎన్నికల్ని నిమ్మగడ్డ తన హయాంలో చేపట్టలేదు. కానీ, కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టినరోజునే ఆగమేఘాల మీద పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు నీలం సాహ్నీ.
సరే, తమిళనాడులో మద్రాసు హైకోర్టు, కరనా సెకెండ్ వేవ్ పాపం ఎన్నికల సంఘానిదేనంటూ అసహనం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆంధ్రపదేశ్ పరిస్థితి వేరు. ఇక్కడ, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల్ని నిర్వహించాలనుకోవడాన్ని, నిర్వహించకూడదనుకోవడాన్నీ తప్పు పట్టలేం. కానీ, రాజకీయ నాయకులు ఏం చేశారు.? ఇంటింటి ప్రచారాలు, నిబంధనల్ని ఉల్లంఘించి జన సమీకరణ చేపట్టడాలు.. ఇవి కదా కరోనా వ్యాప్తికి కారణమయ్యింది.?
రాజకీయ నాయకులంటేనే అంత.. తాము చేసిన నేరాన్ని చాలా తెలివిగా ఇతరుల మీదకు నెట్టేస్తారు. అదే జరుగుతోంది కరోనా విషయంలో. కరోనా సూపర్ స్ప్రెడర్స్.. అనే ముద్ర వేయించుకున్న నాయకులే, వ్యవస్థల్ని విమర్శిస్తోంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?
Recent Random Post: