పేర్ని నాని ప్రశ్న: హీరో సిద్దార్ధ ఎక్కడ ‘ట్యాక్స్’ కట్టాడు.?

ఎక్కడ సంపాదిస్తున్నారు.? ఎక్కడ పన్నులు కడుతున్నారు.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సినిమా జనాలపైకి సూటిగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రమిది. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు చెన్నయ్‌లో వుండేది. ఆ తర్వాత అది హైద్రాబాద్‌కి వచ్చింది.

దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమలు లేవు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం. బెంగాలీ సినిమా, భోజ్‌పురి సినిమా.. ఇలా కొన్ని రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు వున్నా, అక్కడ నిర్మితమయ్యే సినిమాల సంఖ్య చాలా చాలా చాలా తక్కువ.

అమితాబ్ బచ్చన్ ముంబైలో వుంటారు.. ఆయన ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తారు. అలాగని, అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాకుండా వుంటాయా.? సినీ ప్రేక్షకుల్ని ఉద్దేశించి.. లేదా సినిమా బిజినెస్ గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడకూడదని దేశంలో రూల్ ఏమైనా పెట్టారా.?

మన తెలుగు సినిమా.. మన తెలుగు సినీ నటులు.. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడితే, ‘నువ్వెక్కడుంటున్నావు.? నువ్వెక్కడ పన్నులు కడుతున్నావు.?’ అని ప్రశ్నించడమేంటి.? హీరో సిద్దార్ధ మీద ఏకంగా మంత్రి పేర్ని నాని పంచ్‌ల వర్షం కురిపించేశారు తాజాగా.

పన్నులు తమిళనాడు ప్రభుత్వానికో, కేంద్ర ప్రభుత్వానికో కడుతున్నారు.. బహుశా తమిళనాడు ముఖ్యమంత్రినో, ప్రధాన మంత్రినో సిద్దార్ధ ప్రశ్నించి వుంటాడంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. కానీ, సిద్ధార్థ ప్రశ్నించింది అధికారంలో వున్నవారిని. రాజకీయాల్లో డబ్బు సంపాదిస్తున్నవారిని. ప్రజలు కట్టే పన్నులతో లగ్జరీ జీవితాలు గడుపుతున్న నాయకుల్ని. మేటర్ క్లియర్ ఇక్కడ.

తెలివిగా మాట్లాడేశామనుకుని, బొక్క బోర్లా పడటం ఏపీలో వైసీపీ నాయకులకు అలవాటైపోయింది. ఆదాయపు పన్ను కేంద్రానికి వెళితే, ఆ కేంద్రం.. రాష్ట్రాలకు వాటా ఇస్తుంది కదా.? ఆయా పథకాలకు నిధుల్ని కేంద్రం అందిస్తుంది కదా.? విషయం అది కాదు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్య. దానిపై చిత్తశుద్ధి లేక, ఇదిగో ఇలా అడ్డగోలు వ్యాఖ్యలంతే.


Recent Random Post: