జస్ట్ ఆస్కింగ్: 8.8 కోట్లకు ఎంపీ రఘురామ అమ్ముడుపోయారా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుమారు 8.8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారట. ఈ క్రమంలోనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కనుసన్నల్లోనే ఆయన అధికార వైఎస్సార్సీపీ మీద బురద చల్లారట. అలాగని ‘బార్ అండ్ బెంచ్’లో వచ్చిన కథనం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

రఘురామపై రాజద్రోహం పెట్టిన వైఎస్ జగన్ సర్కార్, ఈ క్రమంలో సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో, రఘురామ అమ్ముడుపోయినట్లు ప్రభుత్వం పేర్కొందని బార్ అండ్ బెంచ్ కథనం వెల్లడిస్తోంది. అంతేనా, రఘురామ ప్రసంగాలు రాష్ట్రంలో హింసకు కారణమయ్యాయని కూడా ప్రభుత్వం పేర్కొందట. ఏ హింస.? ఎలాంటి హింస.? అన్నదిప్పుడు తేలాల్సి వుంది.

రఘురామకృష్ణరాజు ఓ రాజకీయ నాయకుడు. దేశంలో చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.. రాజకీయ ఆరోపణలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పు లేదంటూ గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

అను నిత్యం అధికార పార్టీకి చెందిన నేతలు, ఏకంగా బూతులు ప్రయోగిస్తున్నారు ప్రెస్ మీట్లలోనే. వీటిని ఏమనాలి.? రఘురామకృష్ణరాజుపై అధికార పార్టీ నేతలే అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, వాటికి ఆయన కౌంటర్ ఇవ్వకుండా ఎలా వుంటారు.? ఇది చర్య – ప్రతిచర్యకు సంబంధించిన అంశమే.

రఘురామ కారణంగా హింస చెలరేగిన దాఖలాలు రాష్ట్రంలో అయితే లేవు. అమరావతి విషయాన్నే తీసుకుంటే, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో మహిళలు సైతం రక్తమోడారు. దీన్ని రాజ్య హింస.. అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అమరావతిని అయోమయంలో పడేసింది ప్రభుత్వ పెద్దలు. దాన్నే రఘురామ నిలదీస్తూ వస్తున్నారు.

అసలు దేశ పౌరుల మీద రాజద్రోహం కేసులేంటి.? అంటూ ఓ పక్క సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నిస్తున్న వేళ, రాజద్రోహం కేసులో ప్రభుత్వం తరఫున ఓ ఎంపీకి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలవడమే హాస్యాస్పదమన్నది న్యాయ నిపుణుల వాదన. ఏమో, ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ.. ప్రభుత్వ వాదనల్లో పస లేదన్నది మాత్రం నిర్వివాదాంశం.


Recent Random Post: