రాజుగారి వెటకారం: కులం చూడం.. మతం చూడం. ఆ ఒక్కటి తప్ప.!

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. తాజాగా రఘురామ, ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘కులం చూడం.. మతం చూడం.. అని వైఎస్ జగన్ చెబుతుంటారు.. ఔను, క్రిస్టియన్ మతం తప్ప ఇంకో మతం చూడరు.. రెడ్డి కులం తప్ప ఇంకో కులం చూడరు..’ అంటూ రఘురామ విమర్శించారు. అది కూడా, వైఎస్ జగన్ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో ‘కులం చూడం.. మతం చూడం’ అని చెప్పిన తరహాలోనే వాయిస్ మాడ్యులేషన్ మార్చి చెప్పడం గమనార్హం.

వైసీపీ హయాంలో, కీలకమైన పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తున్నారన్నది నిర్వివాదాంశం. అవకాశం వున్నా, లేకపోయినా.. ప్రత్యేకంగా అవకాశాలు కల్పించి మరీ, రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అగ్రపీఠమేస్తోన్న విషయంపై రఘురామ పై విధంగా స్పందించారు.

మరోపక్క, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అత్యంత తీవ్రంగా వున్నా ప్రభుత్వం తగు రీతిలో స్పందించడంలేదనీ, ప్రజల్ని ఆదుకోవడంలేదని రఘురామ ఆరోపించారు. ఇక, మొదట్లో వైసీపీలో బాగానే వున్న రఘురామ, ఏమయ్యిందోగానీ, వైసీపీకి దూరమవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో రఘురామపై వైసీపీ నేతలు, పలువురు మంత్రులు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఆయనపై రాష్ట్రంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దాంతో, గత కొంతకాలంగా రఘురామ ఢిల్లీకే పరిమితమైపోయిన సంగతి తెల్సిందే. మీడియాలో మాత్రం రఘురామ నిత్యం కనిపిస్తూనే వున్నారు. మరీ ముఖ్యంగా, రఘురామ రచ్చబండ.. అధికార వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.


Recent Random Post: