దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతోన్న సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ ను దాటేయడంతో సామాన్యులంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక డీజిల్ రేటు కూడా దాదాపుగా వందరూపాయలకు చేరువ కావడంతో నిత్యావసరవ వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తూ తమిళనాడు సీఎం స్టాలిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పెట్రోల్ ధర లీటరుకు రూ.3 తగ్గిస్తూ తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించారు. నేడు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వెల్లడించారు. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ.3 తగ్గించామని చెప్పారు. ఇప్పటిదాకా లీటర్ పెట్రోల్ పై రూ.32.90 ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా తాజా ప్రకటనతో అది రూ.29.90కు తగ్గింది.
తాజాగా స్టాలిన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు ఏటా రూ.1160 కోట్లు నష్టం వాటిల్లనుంది. అయితే సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో పెట్రోల్ పై రూ.13 డీజిల్ పై రూ.16 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి రాష్ట్రానికి వ్యాట్ శాతంలో మార్పు ఉంటుంది.
Recent Random Post: