
సోషల్ మీడియా ప్రస్తుతం సెలబ్రిటీలకు ఎంత ఉపయోగకరంగా మారిందో, అంతే స్థాయిలో సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. సినిమా రంగం, రాజకీయ రంగం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే వేదికపై ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్, నకిలీ ఖాతాల ద్వారా దాడులు కూడా పెరుగుతున్నాయి. కొందరు కావాలనే సెలబ్రిటీలను టార్గెట్ చేస్తుండగా, మరికొందరు ప్రాజెక్టులు, వ్యక్తిగత కారణాలతో ట్రోలింగ్‌కు దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ టెలివిజన్ నటుడు పార్థ్ సమతాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన ట్రోలింగ్, నకిలీ ఖాతాల ద్వారా జరుగుతున్న వేధింపుల కారణంగా ఆయన సోషల్ మీడియాకు పూర్తిగా గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన భావాలను పంచుకున్న పార్థ్ సమతాన్, తాను ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తినని, మంచి విషయాలను మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చానని పేర్కొన్నాడు. అయితే ఇటీవల కొందరు నకిలీ అకౌంట్లు సృష్టించి తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగా తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వెల్లడించాడు.
ఈ దాడుల వెనుక ఎవరో ఒక నిర్దిష్ట వ్యక్తి ఉన్నారని అనుమానం ఉన్నప్పటికీ, ఆ పేరును బయటపెట్టలేనని పార్థ్ పేర్కొన్నాడు. తన కుటుంబాన్ని రక్షించుకోవడం, మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక భరించడం సాధ్యం కాదని కూడా ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
పార్థ్ సమతాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాకు దూరంగా వెళ్లడం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు, నిరంతర ట్రోలింగ్ వల్ల కలిగే ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్ణయం సరైనదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా, సోషల్ మీడియా ప్రభావం మరోసారి సెలబ్రిటీల మానసిక ఆరోగ్యంపై పెద్ద చర్చకు దారి తీసింది.
Recent Random Post:















