విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా

Share


హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి పదో సినిమా హీరో ఎవరన్న ప్రశ్నకు ఇప్పుడు స్పష్టత వస్తోంది. మళ్లీ మరోసారి సీనియర్ స్టార్‌తోనే ముందుకెళ్లాలని అనీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే **‘మన శంకర వరప్రసాద్ గారు’**తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనీల్, వరుసగా తొమ్మిది విజయాలతో ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. రాజమౌళి తర్వాత ఆ ఘనత సాధించిన దర్శకుడు అనీల్ మాత్రమే కావడం విశేషం.

ఈ నేపథ్యంలో పదో సినిమా ఏ హీరోతో ఉంటుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు? అన్న చర్చ ‘ఎమ్‌ఎస్‌జీ’ విడుదల అనంతరమే మొదలైంది. అయితే ఈ విషయంలో అనీల్ పెద్దగా గందరగోళం సృష్టించకుండా, రెండు వారాల విరామం తర్వాత కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అవుతానని వెల్లడించాడు. కానీ హీరో ఎవరనే అంశంపై మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌లను డైరెక్ట్ చేసిన అనీల్, తదుపరి హీరోగా కింగ్ నాగార్జునతో సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. ఆ అవకాశం లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉంటుందన్న టాక్ కూడా నడిచింది. అలాగే చిరంజీవి–వెంకటేష్ మల్టీస్టారర్‌లో భాగంగా అనీల్ ఉంటాడన్న అంచనాలు కూడా కనిపించాయి.

కానీ అనీల్ అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. నాగార్జునతో కాదు, పవన్ కళ్యాణ్‌తో కాదు, మల్టీస్టారర్ కూడా కాదు… మరోసారి విక్టరీ వెంకటేష్‌తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. కథ ఇప్పటికే లాక్ కాగా, పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి అనీల్ కొంత సమయం తీసుకుంటున్నాడట. అన్ని పనులు పూర్తిచేసి జూన్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్.

ఈ చిత్రానికి నిర్మాతగా సాహూ గారపాటి పేరు వినిపిస్తోంది. అలాగే సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలన్న ఆలోచనలో అనీల్ ఉన్నాడట. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ తెరకెక్కుతోంది. దీనితో పాటు త్వరలోనే ‘దృశ్యం 3’ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. జూన్ నాటికి గురూజీ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో, అదే సమయంలో అనీల్ సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే వెంకటేష్–అనీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: