వీరమల్లు సీక్వెల్‌లో కోహినూర్ కథ క్లారిటీ ఇచ్చిన జ్యోతి కృష్ణ

Share


టాలీవుడ్ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్‌కు ముందురోజే ప్రీమియర్‌ షోలు కూడా జరిగాయి.

మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ప్రారంభంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, మధ్యలో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను ఏ.ఎం. జ్యోతి కృష్ణ తీసుకున్నారు. చివరికి జ్యోతి కృష్ణ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేశారు.

సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు మొదటి భాగం బాగుందని, ఇంటర్వెల్ వరకు ఎంగేజ్ చేసిందని, కానీ రెండో భాగం మాత్రం నిరాశపరిచిందని కామెంట్లు చేస్తున్నారు. క్రిష్ పూర్తిగా డైరెక్ట్ చేసి ఉంటే వేరే రేంజ్‌లో ఉండేదని, జ్యోతి కృష్ణ చేసిన మార్పుల వల్లే తేడా వచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ విమర్శలపై తాజాగా జ్యోతి కృష్ణ స్పందించారు. “నేను ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఉన్నాను. క్రిష్ ఈ కథను మాయాబజార్‌ స్టైల్‌లో, కోహినూర్‌ను ప్రధానాంశంగా తీసుకుని ఒక ఫన్ ఫిల్మ్‌లా చేయాలని అనుకున్నారు. ఆ ఐడియాకి అనుగుణంగా షూట్ మొదలైంది. కొన్ని యాక్షన్ సీన్లు తీసిన తర్వాత కరోనా వచ్చింది. మళ్లీ రెండో వేవ్ రావడంతో ప్రాజెక్ట్‌కు వరుసగా బ్రేక్స్ పడ్డాయి. ఈ క్రమంలో ఒక సంవత్సరం వేచి చూసిన క్రిష్ తనకు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా తప్పుకున్నారు.

ఆ తర్వాత నేను పవన్ గారికి కథను రెండు పార్టులుగా చేయాలని చెప్పగా, ఆయన అంగీకరించారు. అందుకే నా జర్నీ ప్రారంభమైంది. నేను మొదటి భాగంలో మార్పులు చేశాను. క్రిష్ ఆలోచించిన కోహినూర్ కథ రెండో పార్ట్‌లో ఉంటుంది. కోహినూర్ కోసం అసలేం జరిగిందనేది సీక్వెల్‌లో చూపిస్తాము” అని జ్యోతి కృష్ణ వివరించారు.


Recent Random Post: