
మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్ తన కలల ప్రాజెక్ట్‌లలో ఒకటని, ఈ సినిమా కోసం గత కొంతకాలంగా తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ పనులు చేసుకుంటూ వస్తున్నట్టు తెలిపాడు.
ఇటీవలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, స్క్రిప్ట్ పనులు ఇప్పటికి ఓ దశను పూర్తి చేసుకున్నాయని, త్వరలోనే ఈ మెగా ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందని పేర్కొన్నాడు. అయితే, ఈ సినిమాలో నటించిన తర్వాత తనలో ఇక నటించాలనే ఆవేశం ఉండకపోవచ్చునని, ఒక నటుడిగా తాను సంతృప్తి చెందాలని అనుకుంటున్నానని అన్నాడు. ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఆయన రిటైర్ అవుతాడనే ప్రచారం మొదలైంది.
ఈ నేపథ్యంలో ఆమిర్ స్పందిస్తూ, ‘‘మహాభారతం నా చివరి సినిమా కాదు. నా సమాధానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ‘మీరు ఎప్పుడైనా నటనకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందా?’ అనే ప్రశ్నకు స్పందించాను. నాకు సంతృప్తినిచ్చే పాత్రల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాంటి పాత్రలు అందితే, సంతోషంగా నటిస్తాను. నేను చెప్పింది ఇదే. కానీ అందరూ ఆ పాత్ర మహాభారతంలోని పాత్ర అని అనుకొని, తర్వాత ఇక నటించనని భావించారు. నా మాటలను పూర్తిగా వినాలని కోరుకుంటున్నా’’ అని వివరించాడు.
ప్రస్తుతం ఆమిర్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదల కానుంది. అంతేగాక, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో కూడా ఆమిర్ ఒక ముఖ్యమైన క్యామియో రోల్ చేస్తున్నాడు.
Recent Random Post:















