
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ ఇప్పటికే థియేటర్లలో ఉండేది. మొదట క్రిస్మస్కు విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రం, కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఒక దశలో సంక్రాంతి రిలీజ్ గురించి వార్తలు వచ్చాయి, కానీ అది కూడా జరగలేదు. చివరగా, వేసవి సీజన్‌ను ప్రారంభిస్తూ మార్చి 28న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే అదే తేదీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు షెడ్యూల్ అయి ఉండటంతో ఈ రెండు సినిమాల రేసుపై అనుమానాలు మొదలయ్యాయి.
పవన్‌కి వీరాభిమాని అయిన నితిన్, తన అభిమాన హీరో సినిమాతో పోటీకి దిగుతాడా? అనే ప్రశ్న అందరికీ కలిగింది. అందువల్ల హరిహర వీరమల్లు మార్చి 28న రాదని చాలామంది భావించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల నిర్మాత ఏఎం రత్నం హరిహర వీరమల్లు మార్చి 28న విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ షూటింగ్‌కు సంబంధించిన తాజా అప్డేట్ ప్రకారం, కేవలం వారం రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, ఇందుకు పవన్ ఇప్పటికే కాల్షీట్లు ఇచ్చేశారని సమాచారం. దీనితో పవన్ ఫ్యాన్స్ సినిమా ఖచ్చితంగా మార్చి 28న థియేటర్లలోకి వస్తుందని నమ్మకంతో ఉన్నారు.
ఇక రాబిన్ హుడ్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ వెనకడుగు వేయడంలేదు. తాజాగా 50 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. థియేటర్లలో టీజర్‌ను ప్రదర్శిస్తూ ప్రమోషన్లను వేగంగా మొదలుపెట్టారు. అయితే పవన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా, నితిన్ పోటీకి సిద్ధమా? లేక హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడుతుందనే ధీమాతోనే ఈ ప్రచారం చేస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నితిన్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పవన్‌కి అత్యంత సన్నిహితులు. కాబట్టి హరిహర వీరమల్లు సినిమాతో పోటీకి వెళ్లే అవకాశం తక్కువే. వారి వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్ సినిమా వాయిదా పడుతుందనే భావనతోనే నితిన్ టీమ్ రాబిన్ హుడ్ మార్చి 28న విడుదలకు ప్లాన్ చేస్తున్నారా? లేక పవన్ సినిమా విడుదల ఖచ్చితంగా వస్తుందా? అన్నది త్వరలో తేలనుంది. అప్పటి వరకు నితిన్ తన సినిమా రిలీజ్ తేదీ మార్చే అవకాశం లేదనిపిస్తోంది.
Recent Random Post:















