తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశంసలు కురిపించారు. ఏపీలో పరీక్షల రద్దు విషయంలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారని ప్రశంసించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేశ్ సఫలమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణకు మొండిగా ముందుకెళ్లిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తేకానీ స్పష్టత రాలేదని విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసికంగా ఎంతో ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. ఈ విషయంలో సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రధాని మోదీ సైతం పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకోగా.. జగన్ మాత్రం మొండిగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించే సమయం కూడా ఆయనకు దొరకలేదా అని నిలదీశారు. విద్యార్థులు, యువత తలుచుకుంటే ఏమైనా సాధిస్తారని మరోసారి నిరూపితమైందని అచ్చెన్న వ్యాఖ్యానించారు.
Posted inTelugu - Featured Telugu - Political News
