పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ప్రకటించి మూడేళ్లు కావస్తోంది. అయితే ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. దర్శకుడు సుజీత్ ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ రాజకీయ భాధ్యతల కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా, పార్టీ బలోపేతంపై కూడా పూర్తిగా దృష్టి పెట్టిన ఆయన, సినిమాలకు రెగ్యులర్ డేట్లు కేటాయించలేకపోతున్నారు. దీంతో హరిహర వీరమల్లు చివరి దశలో ఉండగా, ఓజీ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదనే వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఓజీ సినిమాను రెండు పార్ట్‌లుగా రూపొందించాలని స్క్రిప్ట్ రచన సమయంలో అడవి శేష్ సూచించినట్లు సమాచారం. స్టైలిష్ మాఫియా థీమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కుమారుడు అకీరా నందన్‌ను ఓ ప్రత్యేక పాత్ర ద్వారా పరిచయం చేయాలనే ఆలోచన కూడా వెలువడింది. అయితే పవన్ దీనికి పూర్తిగా ఒప్పుకోలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను ఒకే భాగంగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అకీరా నందన్ ఇప్పట్లో సినిమాల్లోకి రాబోనని కూడా పవన్ స్పష్టత ఇచ్చారని సమాచారం.
హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని భావిస్తుండగా, ఓజీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే పవన్ రాజకీయ షెడ్యూల్ వల్ల ఈ టార్గెట్ సాధ్యమవుతుందా లేదా అనేది సందేహాస్పదంగా మారింది. ఒకవేళ ఈ ఏడాదిలో విడుదల సాధ్యంకాకపోతే, వచ్చే ఏడాది వేసవికి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశముంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ మాఫియా డాన్‌గా కనిపించనుండగా, దర్శకుడు సుజీత్ సాహో కంటే కూడా మరింత గ్రాండ్‌గా చిత్రాన్ని మలచాలని భావిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా, చివరికి ఇది ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది వేచిచూడాలి.
Recent Random Post: