నటుడిగా అవకాశాలు వచ్చినా, మ్యూజిక్‌కే కట్టుబడ్డ తమన్!

Share


సినిమా ఇండస్ట్రీలో ఎవరి గమ్యం వారిదే అయినా, కొంతమంది ఒక్క రంగంపై ఆసక్తితో వచ్చి మరో రంగంలో స్థిరపడతారు. దర్శకుడు కావాలని వచ్చిన వారు హీరోలుగా, హీరోలు కావాలని వచ్చిన వారు సినిమాటోగ్రాఫర్‌గా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో ఒక దిశలో మొదలైన ప్రయాణం, అనివార్య కారణాలతో మరో దిశగా మళ్లే సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు మాత్రమే తాము నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకునే వరకు ఓర్పుతో ఎదురు చూస్తారు. అడ్డుకట్టలు వచ్చినా, మరో మార్గం సులభంగా కనిపించినా తమ గమ్యానికి నిబద్ధంగా ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వ్యక్తే సంగీత దర్శకుడు తమన్.

తమన్ చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి నుంచి అతని లక్ష్యం మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడమే. సంగీత దర్శకుడిగా తనను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికీ, కెరీర్ ఆరంభంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సమయంలో శంకర్ కొత్త నటీనటుల కోసం చూస్తున్న సమయంలో, సహాయ దర్శకుడిగా ఉన్న సిద్దార్థ్, మ్యూజిక్ టీమ్‌లో ఉన్న తమన్ ఆయన దృష్టిని ఆకర్షించారు. నటనపై ఆసక్తి పెద్దగా లేకపోయినా, శంకర్ అడగడంతో తిరస్కరించలేక ఇద్దరూ నటించారు.

బాయ్స్ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సిద్దార్థ్ హీరోగా మారగా, తమన్‌కు కూడా నటనకు సంబంధించి పెద్ద ఆఫర్లు వచ్చాయి. 7/G బృందావన్ కాలనీ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించగా, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ తమన్ మాత్రం నటనను పూర్తిగా పక్కన పెట్టాడు. ఈ నిర్ణయం చూసి దర్శకుడు శంకర్ కూడా ఆశ్చర్యపడి, నీకు ఇంత క్రేజ్ వస్తే ఎందుకు సినిమాల్లో నటించడం లేదు? అంటూ ప్రశ్నించాడట.

ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్ గుర్తు చేసుకుంటూ, “25వ ఏట సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవాలనే నా లక్ష్యానికి నేను అంకితభావంతో కట్టుబడి ఉండటమే నా విజయానికి కారణం. మధ్యలో నటన వైపు మొగ్గుచూపి ఉంటే, నేను ఈ స్థాయికి రాలేనని స్పష్టంగా తెలుసు” అని చెప్పాడు.

ఆ రోజుల్లో వచ్చిన ఆఫర్లకు మోహంతో నటన వైపు వెళ్లి ఉంటే, తమన్ టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగలేవు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంగీతం అందిస్తున్నాడు. సంగీత దర్శకుడిగా అత్యధిక పారితోషికం అందుకుంటున్నవారిలో ఒకడిగా నిలిచాడు.

తమన్‌కు ముందుచూపు, ఓర్పు, అంకితభావం ఉన్నందునే ఈ స్థాయికి చేరుకున్నాడు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని, కష్టపడితే తప్పకుండా విజయం దక్కుతుందని తమన్ ప్రయాణం మరోసారి నిరూపిస్తోంది. ఆయన కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారింది.


Recent Random Post: